Manda Krishna Madiga : వికలాంగుల సమస్యలు విస్మరిస్తే.. చలో అమరావతి : మందకృష్ణ - ఏపీలో వికలాంగుల సమస్యలు
Manda Krishna Madiga Dharna at Srikakulam Collectorate : వైఎస్సార్సీపీ సర్కారు వికలాంగుల సమస్యలను పెడచెవిన పెడితే చలో అమరావతి నిర్వహిస్తామని, అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తామని వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే పార్కు వద్ద దివ్యాంగులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. 3 వేల పింఛన్‌ను 6 వేలు చేయాలని, ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని, మాకు న్యాయం చేయాలని వికలాంగులతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వికలాంగుల ఫించన్లు పెంచాలని, ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలని, రిజర్వేషన్లను 4 శాతం నుంచి 7 శాతానికి పెంచాలని, అలాగే వికలాంగులకు ఇచ్చే వివాహ ప్రోత్సాహ బహుమతిని కూడా పెంచాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు 32 డిమాండ్లను ఉంచారు మంద కృష్ణ మాదిగ. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే విస్తృతంగా క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.