Man Injured in Blade Attack: భార్యాభర్తల మధ్య గొడవలు.. బావపై బావమరిది బ్లేడ్లతో దాడి - కృష్ణా జిల్లా లేటెస్ట్ న్యూస్
Man Injured in Blade Attack: కృష్ణాజిల్లా గుడివాడలో బావపై, బావమరిది బ్లేడ్లతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన వడ్డీ త్రినాథ్ అనే వ్యక్తిని స్థానికులు.. సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని పామర్రు మండలం యలకురుకు చెందిన కొండాలమ్మ, గుడివాడ డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వడ్డీ త్రినాథ్ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి సంసారంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో భార్యను పుట్టింటికి పంపిన త్రినాథ్పై.. భార్య కుటుంబ సభ్యులు గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతుండగా.. వడ్డీ త్రినాథ్ తన కుటుంబానికి దూరంగా ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న త్రినాథ్పై అతడి బావమరిది తాడికొండ శర్మ.. మరో ఇద్దరు ముసుగు వ్యక్తులతో కలిసి వచ్చి.. బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన త్రినాథను స్థానికులు గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించగా.. గుడివాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.