Malas Meeting in TDP Office: జనసందోహంతో కిక్కిరిసిన టీడీపీ కార్యాలయం.. కనుచూపుమేరలో ఎటుచూసినా.. - మాల కుల సంఘాల నేతల సమావేశం
Malas Meeting in TDP Office: రాష్ట్రంలో నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన మాల సామాజికవర్గం నాయకులతో.. ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మాల ఆత్మీయ సదస్సుకు విశేష స్పందన వచ్చింది. అన్ని నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులతో.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద సందడి నెలకొంది. తెలుగుదేశం నినాదాలతో హోరెత్తించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభిమానులతో.. ఆ ప్రాంతమంతా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కనుచూపుమేరలో ఎటుచూసినా సదస్సుకు వచ్చిన వాహనాలే దర్శనమిచ్చాయి. డప్పు వాయిద్యాలు, డీజేలతో సందడి వాతావరణం నెలకొంది. సంప్రదాయ నృత్యాలు కనువిందు చేశాయి. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్యలు పాల్గొని.. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతం కావాలని ముక్తకంఠంతో నినదించారు. ఎస్సీలకు చంద్రబాబు అందించిన సంక్షేమానికి కోత పెట్టింది.. జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. పేదల్ని ధనవంతులు చేయాలన్నది చంద్రబాబు సంకల్పం అయితే.. పేదల్ని మరింత పేదల్ని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాలలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరుతామని స్పష్టం చేశారు.