ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసు - ప్రధాన నిందితుడి ఇంట్లో పోలీసుల తనిఖీలు - విస్తుపోయే నిజాలు - దేవరకొండ సుధీర్ ఇంట్లో సోదాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2023, 10:15 PM IST
Main accused Sudhir arrested in RTC driver attack case:నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో ఉదయం నుంచి పోలీసులు సోదాలు నిర్వహించారు. సుధీర్ నేర సామ్రాజ్యాన్ని చూసి పోలీసులు విస్తుబోయారు. అతని నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఏడు లక్షల నగదుతోపాటుగా.. నేరాలకు ఉపయోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ఎయిర్ పిస్టల్స్, బేడీలు, రెండు జామర్లు, 20కిపైగా సెల్ ఫోన్స్, ఐరన్ స్టిక్స్, కత్తులను పోలీసులు సీజ్ చేసినట్లు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు సుధీర్‌పై 25 కేసులు ఉన్నట్లు తెలిపారు.
పరిస్థితులకు అనుగుణంగా సుధీర్ తన గ్యాంగ్‌తో అమాయకులను మోసగిస్తూ నేరాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని, రద్దయిన రెండు వేల రూపాయల నోట్లు, దొంగ నోట్ల మార్పిడి పేరుతో సుధీర్ ఎంతోమందిని మోసగించారని వెల్లడించారు. తెలంగాణలో సైతం సుధీర్ బాధితులు ఉన్నారని తెలిపారు. సినిమాలను తలపించే తీరిలో సీన్ క్రియేట్ చేసి, పక్కా ప్రణాళికతో మోసం చేసేవాడని ఎస్పీ పేర్కొన్నారు. సుధీర్ నేరాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే అంశంపై ఆరా తీస్తున్నామన్నారు.