మహాశివరాత్రి సందర్భంగా.. ఇంద్రకీలాద్రీలో మల్లేశ్వరస్వామికి కల్యాణోత్సవం - తెలుగు బ్రేకింగ్ న్యూస్
Indrakeeladri Mahashivaratri : రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రిని పురష్కరించుకుని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహాశివరాత్రి నిర్వహించుకునే ప్రతి క్రతువును.. చిన్న ఆలయాల నుంచి దేవస్థానాల వరకు ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించుకున్నాయి. ఆది దేవుడ్ని పూజించి పరవశించిపోతున్న భక్తులు.. ఆలయాలలో నిర్వహించిన ఉత్సవాలలో పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా.. దక్షిణ వారణాశిగా పేరు సంపాదించుకున్న విజయవాడ ఇంద్రకీలాద్రిలో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. . దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన వేద పండితులు శాస్త్రం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత ప్రారంభించారు. ఈ క్రతువును వీక్షించటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయంలోని రాజగోపురం ఎదురుగా ధర్మపథం కళావేదికపై నిర్వహించిన ఈ కల్యాణోత్సవంలో.. దేవస్థాన పాలకమండలి ఛైర్మన్, సభ్యులు, ఈవో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు మృత్తికాలింగాభిషేకాలు నిర్వహించారు. మల్లేశ్వరాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణ నడుమ.. శివలింగానికి మహన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను కల్యాణ వేదికపైకి మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మల్లేశ్వర స్వామిని వరునిగా, గంగా పార్వతీ దేవిలను వధువులుగా అలంకరించారు. అనంతరం ఆదిదేవులకు కల్యాణం మంగళ వాయిద్యాల నడుమ, వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆది దంపతుల దివ్య కల్యాణంలో భక్తుల పాల్గొని తరించిపోయారు. అర్ధరాత్రి సైతం ఆలయంలోనే ఉన్న భక్తులు కల్యాణ కృతువును వీక్షించారు. ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం ఉత్సవాలను ఘనంగా, శోభాయమానంగా నిర్వహించారు.