Indrakeeladri: శాస్త్రోక్తంగా.. ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగం - విజయవాడ కనకదుర్గ గుడిలో మహాలక్ష్మి యాగం
Mahalakshmi Yagam: విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శోభకృత్ నామ సంవత్సర అక్షరతృతీయ సందర్భంగా చినరాజగోపురం వద్ద యాగం జరిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ యాగం ప్రారంభించారు. ఈ యాగంలో పాల్గొనే ఉభయదాతలకు వెయ్యి రూపాయలు టిక్కెట్టు రుసుంగా నిర్ణయించారు. ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, పాలక మండలి సభ్యులు, ఈవో భ్రమరాంబ తదితరులు ఈ యాగంలో పాల్గొన్నారు. లోక కల్యాణం కోసం మహాలక్ష్మియాగం జరిపించినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. విశ్వమంతా పశుపక్షాదులు, పాడిపంటలు, బోగభాగ్యాలతో తులతూగాలనేది ఈ యాగం సంకల్పమని పండితులు తెలిపారు. తెలుపు, నీలం రంగు కలువలతోపాటు ఇతర పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భక్తులు యాగాన్ని తిలకించారు. యాగంలో పాల్గొన్న ఉభయదాతలకు శేషవస్త్రం, రవిక, పెద్ద లడ్డు, చక్రపొంగలి, పులిహార ప్రసాదంగా అందజేశారు. ఆర్జిత సేవగా ఈ యాగం నిర్వహించారు.