శ్రీశైలంలో కన్నుల పండువగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. తరలివచ్చిన వేలాది భక్తులు - Nandyala District temples news
Srisailam Mahakshetra updates: శ్రీశైలం మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం రోజు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణం రమణీయంగా సాగింది. శివరాత్రి ఘడియలు ప్రారంభం కాగానే మల్లన్న ఆలయం పరిణయ శోభతో అలరారింది. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పరిణయానికి ముస్తాబు చేసి.. నంది వాహనంపై కొలువు తీర్చారు.
అనంతరం అర్చకులు.. వేద పండితులు.. విశేష పూజలు చేసి, నంది వాహనంపై ఆసీనులైన స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ గావించారు. ఉత్సవం ఎదుట కోలాటాలు, డమరుక నాదాలతో కళాకారులు విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ వెంటనే మల్లన్న ఆలయ ప్రాంగణం కళ్యాణ శోభ కాంతులతో భక్తులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. సాంప్రదాయాన్ని అనుసరించి బ్రహ్మోత్సవ కళ్యాణానికి ముందుగా మల్లన్న ఆలయ ప్రాంగణానికి పృద్వి వెంకటేశ్వర్లు అనే వృద్ధ భక్తుడు పాగాలంకరణ చేశారు. ఏడాది అంతా రోజుకు మూర చొప్పున 365 రోజులపాటు స్వయంగా నేసిన పాగా వస్త్రాన్ని మల్లన్న ఆలయానికి చుట్టి తన భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలు ఆర్పి మల్లికార్జున స్వామి గర్భాలయానికి, నందులకు చూడముచ్చటగా పాగా వస్త్రాన్ని అలంకరణ చేశారు.
ఆలయం పైభాగంలో పాగాలంకరణ జరుగుతుండగా.. గర్భాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి మూలవిరాట్‌కు అర్చకులు లింగోద్భవ కాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పాగాలంకరణ తర్వాత మల్లన్న బ్రహ్మోత్సవ కళ్యాణ ఘట్టం భక్త జనులకు నేత్రపర్వంగా మారింది. ఆలయ ప్రాంగణం నాగుల కట్ట వద్ద దేవదేవులకు కళ్యాణ వేదిక అత్యంత వైభవంగా ముస్తాబు చేశారు.
తదనంతరం వివిధ వర్ణాల సోయగం సుమధుర భరితమైన పుష్పాలంకరణ వేదిక మధ్యన దేవదేవులైన శ్రీ స్వామి అమ్మవార్లు ఆది దంపతులుగా కొలువుదీరారు. ఉభయ దేవాలయాల అర్చకులు, వేద పండితులు శాస్త్రబద్ధంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ కళ్యాణ వైభవాన్ని తిలకించిన భక్తజనం ఆనంద పరవశంతో ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
ఇవీ చదవండి