maha rudrabhishekam: కన్నుల పండువగా మహా రుద్రాభిషేకం.. భారీగా తరలివచ్చిన భక్తులు.. - వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం వీడియో
maha rudrabhishekam: బాపట్లలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం కన్నుల పండువగా జరిగింది. లోక కల్యాణార్థం వేగేసిన ఫౌండేషన్ ఛైర్మన్ నరేంద్ర వర్మ.. బాపట్ల ఆర్ట్స్ ఆధ్వర్యంలో శివలింగాన్ని ప్రతిష్టించి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.పరమ శివునికి రకరకాల పండ్లు, పూలు, పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పరమేశ్వరుని అభిషేకాన్ని వీక్షించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు రుద్రాభిషేకాన్ని వీక్షించి.. సాధువుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం అశేష భక్తజన సందోహం మధ్య భారీగా ఊరేగింపు తరలి వెళ్లి ఆ శివలింగాన్ని సూర్యలంక సముద్ర తీరంలో నిమజ్జనం చేసి కార్యక్రమం ముగించారు. కార్యక్రమం అనంతరం మాట్లాడిన వేగేసిన ఫౌండేషన్ ఛైర్మన్.. ఈ మహా రుద్రాభిషేకం లోకకల్యాణార్థం ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ జరిపించినట్లు తెలిపారు. పరమశివుని ఆశీస్సులతో ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.