మంత్రుల పర్యటనకయ్యే ఖర్చుల కోసమే లంచాలు - తహసీల్దార్ సంచలన వ్యాఖ్యలు - మంత్రుల పర్యటనకయ్యే ఖర్చుకోసం లంచాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 2:59 PM IST
Madakasira MRO Sensational Comments: మంత్రులు, అధికారులు పర్యటనకు వచ్చినప్పుడు లక్షల రూపాయలు ఖర్చవుతోందని, దీనికి నా జేబులోంచి పెట్టుకోవాలా, లంచం తీసుకున్న నగదేనని ఓ తహసీల్దార్ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మంత్రులు పర్యటనకు వచ్చినప్పుడు లక్షల రూపాయలు ఖర్చవుతోందని, వారికి తిండి దగ్గర్నుంచి సకల సౌకర్యాలు కల్పించడానికి నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలని, అందుకయ్యే నగదును తమ వద్దకు సేవల కోసం వచ్చిన వారి నుంచే వసూలు చేస్తామని తహసీల్దార్ అన్నారు.
సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దార్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రుల, ఉన్నతాధికారుల పర్యటనలకు ఖర్చు అయ్యే లక్షల రూపాయల కోసం లంచాలు తీసుకోక తప్పడం లేదని ఆయన అన్నారు. మడకశిర మండలం మెళవాయి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ రైతు భూ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ సిబ్బందిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారి తనకు అన్యాయం చేశాడని తహసీల్దార్ ముర్షావలి వద్ద ఫిర్యాదు చేయడానికిి వచ్చాడు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది అవతలి వ్యక్తి నుంచి లంచం తీసుకొని తనకు అన్యాయం చేశాడని బాధిత రైతు గోడు వినిపించాడు. రెవెన్యూ శాఖలో లంచాలు ఇస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి బదులుగా తహసీల్దార్ స్పందిస్తూ మంత్రులు, ఉన్నతాధికారులు వస్తే లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి డబ్బును లంచాల రూపంలో కాకుండా, మా జీతాల్లో ఖర్చు పెట్టాలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శరీరంలోని కొన్నిచోట్ల గాయాలైతే ఎదుటివారికి కనిపించవని, తమ పరిస్థితి అలానే ఉందని వివరించారు.