Lokeh: అరక దున్నుతూ.. అన్నదాత కష్టాలు తెలుసుకున్న లోకేశ్
Lokesh Yuvagalam : నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభించింది. 89వ రోజు రేమడూరు నుంచి లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడే గ్రామ ప్రజలు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని, తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. పుసులూరులో దళితులు లోకేశ్‌ను కలిశారు. 27 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారని.. విన్నవించారు. అనంతరం బొల్లవరంలో పత్తి చేనును లోకేశ్ పరిశీలించారు. గ్రామంలో కనీస వసతులు లేవని.. వాటిని పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. లోకేశ్‌తో పాటు.. పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు.
కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది:కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేశ్.. అరక దున్నుతూ రైతన్న కష్టాలు తెలుసుకున్నారు. బొల్లవరం శివారులో చంటిబిడ్డను కాడిమధ్య ఉయ్యాలలో వేసి, సేద్యం చేస్తున్న రైతు మౌలాలిని లోకేశ్ కలిశారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని... మీరు అధికారంలోకి వచ్చాక మాలాంటి వారిని ఆదుకోవాలని రైతు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కౌలురైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని... లోకేశ్ హామీ ఇచ్చారు.
దిశ చట్టం పెద్ద మోసం:దిశ చట్టం పెద్ద మోసమని, అసలు చట్టమే లేకుండా స్టేషన్లు ప్రారంభించారని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ నాయకులే మహిళల్ని అసెంబ్లీ సాక్షిగా అవమానపరుస్తున్నారని... అందుకే మహిళలపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని... జే బ్రాండ్ లిక్కర్ విషం కంటే ప్రమాదమని.. డబ్బు పిచ్చితో జగన్... ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.