Lokesh selfie at PattiSeema Project : పట్టిసీమతో కృష్ణాడెల్టా రైతుల నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు చంద్రబాబు: లోకేశ్ - Nara Lokesh Yuvagalam Padayatra
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 24, 2023, 5:12 PM IST
Lokesh selfie at PattiSeema Project :పట్టిసీమతో కృష్ణా డెల్టా నీటి కష్టాలు తీర్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. దేశ చరిత్రలో తొలిసారిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు అపర భగరీథుడుగా పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెం వద్ద గల పట్టిసీమ కాలువను పరిశీలించిన లోకేశ్.. కృష్ణా డెల్టా రైతుల కష్టాలు తీర్చేందుకు కేవలం 11నెలల వ్యధిలో రూ.1360 కోట్ల వ్యయంతో 2016లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా పట్టిసీమ కాలువ వద్ద సెల్ఫీ లోకేశ్ తీసుకున్నారు.
రికార్డు సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా కూడా పట్టిసీమ లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్‌లో స్థానం (PattiSeema Project in Limca Book of Records) పొందిందని లోకేశ్ అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలోని రైతులకు ఖరీఫ్ సీజన్లో పుష్కలంగా సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టగా, ఈ ప్రాజెక్టు ఫలితాలను 2016-19 నడుమ మూడు సీజన్లలో రైతులు కళ్లారా చూశారన్నారు. రోజూ గరిష్టంగా 8500 క్యూసెక్కుల (0.73 టీఎంసీలు) నీటిని తీసుకునేలా డిజైన్ చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రతిఏటా 100 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి కృష్ణానదికి తీసుకునే అవకాశముందని చెప్పారు.
నాడు దండగ అన్న జగన్‌కు నేడు పట్టిసీమే దిక్కయిందని విమర్శించారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా ఇప్పుడు చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. దార్శనికుడు చంద్రబాబు నాయుడు ముందుచూపునకు పట్టిసీమ ప్రాజెక్ట్ నిదర్శనం అని లోకేశ్ తెలిపారు.