Lokesh Fire on CM Jagan: జగన్ సర్కార్ కార్పొరేషన్ పెట్టినా.. గీత కార్మికులకు ఒక్క రూపాయీ ఇవ్వలేదు: నారా లోకేశ్ - tdp youth leader nara lokesh comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 9:10 PM IST
TDP Youth Leader Nara Lokesh Key Assurances to Geetha Workers: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గీత కార్శికులకు కీలక హామీలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికులకు దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో గీత కార్మికులపై పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామన్నారు. బీసీల రక్షణ కోసం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామన్నారు.
టీడీపీ రాగానే బీసీలపై పెట్టిన దొంగ కేసులను ఎత్తివేస్తాం.. టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర శుక్రవారంతో 201వ రోజుకీ చేరుకుంది. నేటి పాదయాత్రలో నారా లోకేశ్ 'ఇది నవ గళం-ఇది మన గళం' అనే పేరుతో తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల శివార్లలో గీత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..''జగన్ సర్కార్ కార్పొరేషన్ పెట్టినా.. గీత కార్మికులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఆదుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలపైనా దొంగ కేసులు పెడుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంటుందో అందరూ గ్రహించాలి. టీడీపీ రాగానే బీసీ సోదరుల కోసం ఓ ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం. బీసీలపై పెట్టిన దొంగ కేసులను ఎత్తివేస్తాం. గీత కార్మికులు కల్లు గీయలేని 4 నెలల సమయంలో ఆర్ధికంగా ఆదుకునే కార్యక్రమాలు తీసుకువస్తాం'' అని ఆయన అన్నారు.
నల్లజర్ల మండలం చీపురుగూడెంలో రహదారిపై వర్షపు నీరు నిలిచింది. రోడ్ల దుస్థితిని తెలుపుతూ లోకేశ్, బుచ్చయ్య చౌదరి వరి నాట్లు వేశారు.