'ఊరికి ఏం చేశారో చెప్పాలి' - కావలి ఎమ్మెల్యేని నిలదీసిన స్థానికులు - andhra pradesh
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 3:20 PM IST
Locals Questioned Kavali MLA Pratap Kumar Reddy: రాష్ట్రంలో వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నాయకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తాజాగా ఊరికి ఏం చేశారంటూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలోని చెన్నాయి పాలెం గ్రామస్థులు నిలదీశారు. ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడైన ఏఎంసీ ఛైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
రోడ్లు బాగోలేవని, మురుగు కాలువలు లేవని, వీధిలైట్లు వెలగకున్నా పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం పరిగెత్తుకుని వచ్చారని మండిపడ్డారు. ఎన్ని సేవలు చేసినా ఎమ్మెల్యే గుర్తించకపోవడం బాధాకరమని ఓ స్థానిక నాయకుడు వాపోయాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామం కొంతైనా అభివృద్ధి జరిగిందని అందుకే పార్టీ జెండాను కడుతున్నానని తెలిపారు. ఇదంతా చూసిన ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోయాడు.