వీణల విందుగా.. అమెరికాలోని తెలుగువారి శివస్తోత్రం.. లింగాష్టకం..! - They made a video album of Lingashtakam in Telugu
మహాశివరాత్రి సందర్భంగా అమెరికాలోని డల్లాస్లో నివశిస్తున్న తెలుగువారు లింగాష్టకం వీడియో ఆల్బమ్ రూపొందించారు. వి షార్ప్ గురుకులం, ప్రియాస్ సెవెన్ స్ట్రింగ్స్ సంయుక్తంగా రూపొందించిన లింగాష్టకంలో వివిధ సంగీత రీతులు నేర్చుకుంటున్న విద్యార్థులు పాల్గొన్నారు. శివ స్తోత్రాల్లో లింగాష్టకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తరుచుగా ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల మనశ్శాంతి కలుగటంతో పాటు చెడు అలవాట్లకు దూరమవుతారు. లింగాష్టక స్తోత్రాన్ని పఠించడం వలన శివలోకాన్ని చేరుతారని పెద్దల నమ్మకం. అలాంటి లింగాష్టకాన్ని యువ సంగీతకారులతో పలికించటం ద్వారా వారు నేర్చుకున్న విద్యకు సార్థకత కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 100మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొన్నారు. మన సంప్రదాయ సంగీత వాయిద్యమైన వీణకు, పాశ్చాత్య సంగీత పరికరాలైన హార్ప్, వయోలిన్, ఒబే, క్లారినెట్, గిటార్, పియానోను మేళవించారు. వివిధ రకాల సంగీత వాయిద్యాలను కళాకారులు వాయిస్తుండగా, మరికొందరు తమ గాత్రంతో ఆ పరమశివుడిని అర్చించారు. గురుకులం గురూస్ సంస్థకు చెందిన కృష్ణ శ్రీధరన్, మయూ హారిసన్, ప్రవీణ్ సాల్వి, వసంత్ వశీగరణ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీడియోగా రూపొందించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తమ పిల్లలకు మన సంస్కృతిని, సంప్రదాయాల్ని నేర్పించటం, కొనసాగించటం కోసం అక్కడి తెలుగువారు తపిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ లింగాష్టకం కార్యక్రమం అని నిర్వాహకులు తెలిపారు.