అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి - ప్రభుత్వానికి వామపక్షాల డెడ్లైన్ - CPI members Meeting latest
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 7:45 PM IST
Left parties Meeting About Anganwadis: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె గురువారానికి పదో రోజుకు చేరింది. వీరి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, పరిష్కరించని పక్షంలో అంగన్‌వాడీలు కొనసాగించే ఉద్యమానికి డిసెంబర్ 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు పది వామపక్ష పార్టీలు సమావేశం నిర్వహించాయి.
అంగన్‌వాడీల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పార్టీ నేతలు చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల తరపున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రసాద్ మాట్లాడారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు పట్టించుకోకుండా చివర్లో చర్చల పేరుతో కాలయాపనకు ప్రయత్నించిందన్నారు. అందులో చిన్న చిన్న అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా వాటికీ జీఓ ఇవ్వటంలో పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించిందని తెలిపారు. నా అక్కాచెల్లెమ్మలు అని చెబుతున్న సీఎం హామీల ఆచరణ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని వివరించారు. అంగన్వాడీల గ్రాట్యుటీ, వేతన పెంపు గురించి ప్రభుత్వం నోరెత్తడం లేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రసాదు, రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు సహా ఇతర నాయకులు హాజరయ్యారు.
TAGGED:
విజయవాడలో వామపక్షాల సమావేశం