'ఎన్నికలు దగ్గరపడ్డాయి - ఈ ప్రభుత్వం ఇక చేసేదేమీ లేదు' అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు' - Ambedkar Konaseema District News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 5:18 PM IST
Leaders Questioned to Officials in Mandal Praja Parishad : కోనసీమ జిల్లా పి.గన్నవరం మండల ప్రజా పరిషత్ సమావేశం వాడివేడిగా జరిగింది. లంక గ్రామాల్లోని సమస్యలపై సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారులను నిలదీశారు. ప్రధానంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చిన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. గత ఏడాది వరదల కారణంగా లంక గ్రామాలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. వరదలతో ఇళ్లు కోల్పోయిన కొంతమందిని ఇళ్లు నిర్మించుకోమని అధికారులే చెప్పారని.. గుర్తుచేశారు. తీరా ఇంటి నిర్మాణం చేపట్టాక బిల్లులు రాక ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయని తెలిపారు. ప్రభుత్వం ఈ విధంగా ప్రజలను మోసం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే.. గ్రామాలలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక గుత్తేదారులు ముందుకు రావడం లేదని ట్రాన్స్ కో ఇంజినీరింగ్ అధికారి తెలిపారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని ఇక ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని సభ్యులు వాపోయారు.