Lawyers Met Lokesh in Kurnool: జగన్‌లా మాట ఇచ్చి మడమ తిప్పం.. హైకోర్టు బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేస్తాం: లోకేశ్
Lawyers Met Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా.. జిల్లా కోర్టు భవనం ముందు న్యాయవాదులు లోకేశ్‌ను కలిశారు. పాదయాత్రకు.. సంఘీభావం తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో కర్నూలుకు కేటాయించిన జ్యుడీషియల్ అకాడమీని జగన్ తరలించారని లోకేశ్ విమర్శించారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారని ధ్వజమెత్తారు. జగన్ మాయమాటలు విని మోసపోయామని ఈ సందర్భంగా న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌లా మాట ఇచ్చి మడమ తిప్పబోమని.. కర్నూలులో బెంచ్.. కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని లోకేశ్ స్పష్టం చేశారు.
మరోవైపు కర్నూలు నగరంలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్‌ను న్యాయవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని.. ఎస్బీఐ సర్కిల్ వద్ద పాదయాత్రను అడ్డుకుని న్యాయవాదుల నిరసన తెలిపారు. అయితే న్యాయవాదులకు లోకేశ్ గట్టిగా బదులిచ్చారు. హైకోర్టు తెస్తానంటూ మాటిచ్చి మోసం చేసిన సీఎం జగన్ ఇంటి ముందు నిరసన తెలపాలని సూచించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనేమో బెంగుళూరు వెళ్లి విశాఖలో హైకోర్టు అన్నారని.. కానీ సుప్రీంకోర్టులో అమరావతిలోనే హైకోర్టు అని అఫిడవిట్ దాఖలు చేశారని.. న్యాయవాదులకు లోకేశ్ తెలిపారు. నిరసన చేస్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకోవడంతో.. లోకేశ్ ముందుకు కదిలారు.