లా కోర్సు అడ్మిషన్లు ఇవ్వకుండా విద్యార్థులకు షాక్ ఇచ్చిన కాలేజీ యాజమాన్యం! - కళాశాల యాజమాన్యం పై కలెక్టర్ కు ఫిర్యాదు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 6:44 PM IST
Law college admissions controversy in Prakasam district:వారంతా న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని కష్టపడి చదివారు. చివరకు లా సెట్లో మంచి ర్యాంక్ సాదించారు. వివిధ కారణాలతో తమకు మెుదటి కౌన్సిలింగ్లో వచ్చిన కళాశాలలను కాదని, ప్రకాశం జిల్లాలోని దేవరాజుగట్టులోని ఎన్ఎస్ లా కాలేజీలో చివరి కౌన్సిలింగ్కు అప్లై చేశారు. ఆ కాలేజీలో సీట్ వచ్చింది. అయితే, కళాశాలలో లా కోర్సులో చేరేందుకు వెళ్తారు. కానీ, అక్కడ సిబ్బంది లేకపోవడం, ఈ రోజే చివరి తేదీ కావడంతో, లా స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులోని ఎన్ఎస్ లా కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలో లా కోర్సులో చేరేందుకు వెళ్లిన విద్యార్థులకు యాజమాన్యం అందుబాటులో లేదని ఆరోపించారు. కళాశాలలో చేరేందుకు మూడు రోజుల నుంచి సిబ్బందిని సంప్రదించేందుకు యత్నిస్తున్నా, స్పందన లేదని వాపోయారు. కళాశాలలో చేరేందుకు ఈ రోజే చివరి రోజని లా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి ఎంట్రన్స్ పరీక్షలు రాశామని, కౌన్సెలింగ్లో 'ఎన్ఎస్ లా' కళాశాలలో సీటు వచ్చి ఉపయోగం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమ సీట్లు అమ్ముకోవడానికే యాజమాన్యం ఇలా వ్యవహరిస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం తీరుపై మార్కాపురం సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.