Lanka Villages Stuck in Flood Water: వరదలో లంక గ్రామాలు.. పర్యటించిన మంత్రి చెల్లుబోయిన
Minister Venugopala krishna Toured Lanka Villages: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల లోపలికి వరద చేరిపోయింది. వరదల ధాటికి కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుని పోయాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. విస్తారంగా కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంట పొలాలు కొట్టుకునిపోయాయి. అప్పులు తెచ్చి పంటలపై పెట్టిన పెట్టుబడి అంతా నీటిపాలు కావటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇలా వరద ఉద్ధృతికి రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కోనసీమ జిల్లాలో గోదావరి ఉద్ధృతికి లంక గ్రామాల్లోకి వరద చేరిపోయింది. జలమయంగా మారిన కె.గంగవరం మండలం కోటిపల్లిరేవులో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పడవలో వెళ్లి పర్యటించారు. ముంపు గ్రామ ప్రజలను పరామర్శించిన ఆయన.. వరద నీటి ఉద్ధృతితో కోతకు గురవుతున్న ఏటి గట్టుకు స్వయంగా ఇసుక బస్తాలను మోసి మరమ్మతులు చేపట్టారు. ముంపు ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.