Land Dispute in Rayachoti: రాయచోటిలో భూ వివాదం.. వైఎస్సార్సీలోని ఇరు వర్గాల ఘర్షణ - ఏపీ వార్తలు
Fight Between Two YSRCP Leader For Land in Rayachoti : అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో భూ వివాదం వైఎస్సార్సీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అయితే రింగ్ రోడ్డు సమీపంలోని మిట్టవాండ్లపల్లి వద్ద ఉన్న సుమారు 30 ఎకరాల భూమికి సంబంధించి కొలతలు వేసేందుకు వేంపల్లి వైఎస్సార్సీపీ నాయకుడు రెవెన్యూ అధికారులు, పోలీసులతో అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్సీపీకి నాయకుడు కూడా అక్కడకు వచ్చారు. ఆ భూమి తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిందని, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి కొలతలు వేసేందుకు మంది మార్బలంతో వచ్చారని అన్నారు. కొలతలు వేసేందుకు వీల్లేదని వారిని అడ్డుకున్నారు. సుమారు 17 ఎకరాలు పైబడి తమదేనంటూ వేంపల్లి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వాదించాడు.
రెండు వర్గాల వారు ఆ భూమి తమదేనంటూ వాదోపవాదాలకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు వైఎస్సార్సీపీకి చెందిన వారే కావడంతో పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గత 20 సంవత్సరాలుగా అదే భూమిపై అనేక రిజిస్ట్రేషన్లు జరిగాయని రెవెన్యూ సిబ్బంది తెలుసుకున్నారు. న్యాయపరంగా తేల్చుకున్న తర్వాతే ఈ భూమిలో కొలతలు వేస్తామని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది.