Land Dispute in Jagananna Colony: జగనన్న కాలనీలో స్థల వివాదం.. పరిస్థితి ఉద్రిక్తం - పార్వతీపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
Land Dispute in Jagananna Colony: జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలను తమ గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో కేటాయించారని.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వెలగాడ గ్రామస్థులు అధికారుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం 120 మందికి పైగా లబ్ధిదారులుంటే.. వారిలో కొంతమంది వద్ద అధికారులు డబ్బులు తీసుకుని 44 మందికి గ్రామ ప్రధాన రహదారి వెంబడి స్థలాలు కేటాయించారని ఆరోపించారు. మిగిలిన వారికి 5 కిలోమీటర్ల దూరంలో.. గిరిజన గ్రామ సమీపంలో స్థలాలు కేటాయించారని, ఇలా చేయటం అన్యాయమంటూ వాపోయారు. అయితే గృహ నిర్మాణాలు ప్రారంభం కాకపోవడానికి గల కారణాలపై విచారణ చేసేందుకు తాము గ్రామానికి వచ్చామని.. స్థలాల కేటాయింపుతో తమకు సంబంధం లేదని అధికారులు ఆందోళకారులకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గ్రామంలోని ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు వివాదం పెద్దది కాకుండా ఇరువర్గాలకు సర్దిచెప్పారు. కాగా ఈ వివాదంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యంతో వివాదం సద్దుమణిగింది.