Kurnool Mayor Vote Missing: కర్నూలులో మేయర్ ఓటు గల్లంతు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి..?
Kurnool Mayor BV Ramaiah Vote Missing from Voter List : కర్నూలు జిల్లాలో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా తయారైంది. అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారు. మరోవైపు ఇంటి నంబర్లు లేకుండానే వందల సంఖ్యలో ఓటర్లను ఇబ్బడిముబ్బడిగా చేరుస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 9 వేల ఓటర్లను తొలగించారు. పోలింగ్ బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నగర మేయర్ బీవీ రామయ్య ఓటు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. బీవై రామయ్య పాణ్యం నియోజకవర్గం గడివేముల వాసి. గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2021 వరకు ఆయన పేరు గడివేములలోనే ఉంది. తర్వాత 2021 మార్చిలో ఆయన పాణ్యం నియోజకవర్గంలో కల్లూరు ఆర్బన్ పరిధిలోని 19వ వార్డులో ఉంటున్నట్లు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. అక్కడి నుంచే కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆయన రెండు చోట్ల ఓటరుగా ఉన్నారు. ఫొటోలు పోల్చలేనట్లుగా ఉండడంతో ఒక ఓటును తొలగించే క్రమంలో పొరపాటున రెండు ఓట్లు తొలగించారని రెవెన్యూ అధికారులు తెలిపారు. తన ఓటును కావాలనే తొలగించారని.. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని మేయర్ బీవై రామయ్య తెలిపారు. నగర ప్రథమ పౌరుడికే ఇలా జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన విచారం వ్యక్తం చేశారు.