ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Krishnashtami_Celebrations_in_AP

ETV Bharat / videos

Krishnashtami Celebrations in AP: వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. భక్తుల ప్రత్యేక పూజలు - ఏపీ లేటెస్ట్ న్యూస్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2023, 7:50 PM IST

Krishnashtami Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తులు వైభవంగా నిర్వహించారు. విజయవాడ శివారు వాంబే కాలనీలో శ్రీ రాధాకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణ భగవానుడిని పల్లకిలో ఊరేగించారు. కనక తప్పెట్ల బృందం నిర్వహించిన విన్యాసాలు వీక్షకుల్ని అలరించాయి. విశాఖ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి గోశాలలో శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరిపారు. ధర్మకర్తల మండలి సభ్యులు, వేద పండితులు.. ధ్యాన వాహనాది సోడ సోపచార పూజలు, అష్టోత్తర శతనామావళిని వైభవంగా జరిపించారు. అనంతరం గోశాలలోని గోవులను అందంగా అలంకరించి.. ప్రసాదాలు తినిపించారు. 

తిరుపతి జిల్లా నాయుడుపేటలోని రాజగోపాలపురం రామాలయం వద్ద యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు కనుల పండువగా జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమార్చన చేశారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతిలోని ప్రఖ్యాత ఇస్కాన్ అష్టసఖీ సమేత రాధాగోవింద కమల మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని, దేవతామూర్తుల విగ్రహాల్ని ప్రత్యేకంగా నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 

తెల్లవారుజామునే ఆలయ అర్చకులు మంగళహరతి, తులసీ పూజ, నరసింహ కీర్తన జపము చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కృష్ణుడు వేషధారణలోని చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరోవైపు అంబేడ్కర్ జిల్లా పి.గన్నవరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఒడిశాకు చెందిన భక్త బృందం హరినామ కీర్తనలు ఆలపించారు. శ్రీకృష్ణుడికి జన్మస్థల పూజ నరసింహ హోమం ఉంజల్ సేవను భక్తిశ్రద్ధలతో జరిపారు. వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక కృతువును కనులారా వీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details