Kothakota Special Ganpati Idols : కొత్తకోట గణపతి విగ్రహాలకు విశేష ఆదరణ.. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా - వినాయక చవితి విగ్రహాల తయారిీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 3:27 PM IST
Kothakota Special Ganpati Idols : చిన్నపిల్లలు మొదలు.. పెద్దల వరకూ అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసే వినాయక చవితి పండుగ సమయం ఆసన్నమైంది. వినాయకచవితి రోజు ప్రత్యేకంగా పూజా మండపం ఏర్పాటు చేసి, గణనాథుడి ప్రతిష్టించి, పూలు, పండ్లలతో పూజిస్తారు. ఎంత అలంకరించినా విఘ్నేశ్వరుడి విగ్రహం ఆకర్షణీయంగా లేకపోతే ఎవరికి నచ్చదు. అందరూ చూసేది లంబోదరుడి ప్రతిమనే. గణపతి ప్రతిమలు (Ganapathi idols) ఎవరి దగ్గర బాగుంటాయా అని తెలుసుకుని మరీ... ఎంత దూరమైనా వెళ్లి కొంటారు. అలాంటి విగ్రహాల తయారీలో అనకాపల్లిలోని కొత్తకోట విగ్రహాలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి.
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట పరిసర ప్రాంతాల్లో తయారు చేసే విగ్రహాలు ప్రత్యేకమైన పేరు ఉంది. ఈ విగ్రహాల కోసం రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రి.. ఇలా పలు ప్రాంతాలు నుంచి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఉత్సవాల నిర్వాహకుల అభిరుచులకు తగ్గట్టుగా వారి ఆర్థిక స్తోమతను బట్టి రెండు అడుగులు మొదలుకొని 15 అడుగుల వరకు వివిధ రూపాల్లో విగ్రహాలను తయారు చేయడం వీరి ప్రత్యేకత. గత మూడు ఏళ్ల నుంచి కరోనా ప్రభావంతో పరిశ్రమలు అంతగా లేవని ఈ ఏడాదైన వాణిజ్యపరంగా తమకు ఆశాజానికంగా ఉంటుందని కొత్తకోట విగ్రహాల తయారీదారుడు కోటేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.