వైభవంగా కోరుకొండ నరసన్న రథోత్సవం.. రథం లాగిన హోం మంత్రి వనిత - రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
KORUKONDA RATHOTSAVAM : తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ నరసన్న రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కోరుకొండ స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర వేడుకలకు అంగరంగం వైభవంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జిల్లా కలెక్టర్ మాధవి లత.. స్థానిక అధికారులతో కలిపి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం 615 మెట్లు ఎక్కీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం హోం మంత్రి వనిత మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారని.. దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని తెలిపారు. స్వామి వారి దర్శనం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేసామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని మంత్రి తానేటి వనిత అన్నారు.
ఘనంగా జరుగుతున్న రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవం ప్రారంభమైన కొద్దిసేపటికి రథం చలకల్లోకి(పొలాలు) చేరింది. అనుకోని సంఘటనతో భక్తులు ఉలిక్కిపడ్డారు. రథం పొలాల్లోకి వెళ్లడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. కోరుకొండ మండలం కాపవరానికి చెందిన సత్యనారాయణ కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తైన అధికారులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది.. గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. పెద్ద ప్రమాదం తప్పడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.