Kollu Ravindra Challenge: 'మచిలీపట్నం అభివృద్ధిపై చర్చకు సై.. ఎవరొస్తారో రండి' - మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
Kollu Ravindra Challenge To Perni Nani: మచిలీపట్నం అభివృద్ధిపై సీఎం సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర. తనతో చర్చించేందుకు ఎవరు వస్తారో రండి అని ఎమ్మెల్యే పేర్ని నానికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పోర్టు పేరుతో పేర్ని నాని సరికొత్త నాటకాలకు తెరలేపారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని హడావిడిగా నిబంధనలు తుంగలో తొక్కి పోర్టు పనుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాటి నుండి నేటి వరకు పోర్టు పేరుతో పేర్ని నాని బందరు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్సార్‌ని తీసుకొచ్చి 6220 ఎకరాల్లో పోర్టు పనులు అంటూ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి 5,400 ఎకరాల్లో పోర్టు అన్నారు. ఈ రోజు 1800 ఎకరాల్లో పోర్టు పనులు అంటున్నారని ఎద్దేవా చేశారు.
నాడు టీడీపీ హయాంలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా పనులు చేపట్టామని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ పోర్టుని కాస్త మైనర్ పోర్టుగా మార్చేశారని దుయ్యబట్టారు. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని ఆక్షేపించారు. మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి మేమే చేపట్టాం అని గొప్పలు చెప్పుకుంటున్నపేర్ని నాని.. ఓ సారి రికార్డులు తీస్తే ఫిషింగ్ హార్బర్, మెడికల్ కాలేజ్ ఏ విధంగా మచిలీపట్నంకు వస్తాయో తెలుస్తుందన్నారు. కమిషన్ల కోసం పోర్టు నిర్మాణంలో నిబంధనలను తుంగలో తొక్కారని... ఎటువంటి అనుభవం లేని మేఘా సంస్థకు పోర్టుని రివర్స్ టెండరింగ్ లో కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.