Kolikapudi Srinivasa Rao Padayatra: మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మించాలి.. జోరువానలోనూ పాదయాత్ర - kolikapudi srinivas padayatra
Kolikapudi Srinivasa Rao Padayatra Completed: అమరావతిలో ఆర్ 5 జోన్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి అమరావతి వరకు చేపట్టిన పాదయాత్ర నేడు ముగిసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలోని తితిదే ఆలయం వద్ద పాదయాత్ర ముగిసింది. ఉదయం ప్రకాశం బ్యారేజ్ వద్ద కొలికిపూడికి అమరావతి రైతులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి కృష్ణాయపాలెం, వెంకటపాలెం మీదుగా తితిదే ఆలయానికి చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయంలో కొలికపూడి శ్రీనివాస్, రైతులు పూజలు చేశారు. దాదాపు తొమ్మిది రోజులు పాదయాత్ర నిర్వహించారు. చివరి రోజు రైతులు, టీడీపీ నేతలు కృష్ణాయపాలెం నుంచి కొలికిపూడి శ్రీనివాస్ నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. జోరుగా వర్షం కురుస్తున్నా.. పాదయాత్రను కొనసాగిస్తూ.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించి.. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని నిర్మించాలని కొలికిపూడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అదే విధంగా ఆర్ 5 జోన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.