Kidney Racket: విజయవాడలో మరో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు.. పోలీసులకు వరుసగా ఫిర్యాదులు
Kidney racket in Vijayawada: విజయవాడ భవానీపురం పరిధిలో మరో కిడ్నీ రాకెట్ గుట్టురట్టైంది. కిడ్నీ దానానికి అనుమతి కోరుతూ విజయవాడ పశ్చిమ తహశీలద్దార్ కార్యాలయానికి నకిలీ దరఖాస్తులు వచ్చాయి. పోలీసులకు వరుసగా 2 ఫిర్యాదులు అందగా.. ఇప్పటికే ఒక కేసులో నలుగురిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం నాడు తాజాగా మరో ఫిర్యాదు వచ్చింది. తహశీల్దార్ లక్ష్మీ పోలీసులకు రెండు ఫిర్యాదులను ఇచ్చారు. కిడ్నీ మార్పిడి కోసం అప్లికేషన్లు వచ్చాయని.. అప్లికేషన్ విచారణలో ఆర్థిక లావాదేవీలు చోటు చేసుకున్నాయని గుర్తించామని తెలిపారు. 26వ తేదీన పోలీసులకు సమాచారం ఇచ్చామని.. ఈ రోజు కూడా కిడ్నీ మార్పిడి కోసం వచ్చిన అప్లికేషన్ను విచారిస్తే నకిలీ అని తేలిందన్నారు. వీటిపై విచారణ కోసం వెళ్తే ఆధార్లో , పాన్ కార్డుల్లో మార్పులు చేసినట్లు గుర్తించామన్నారు. రెండు పాన్ కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు కిడ్నీ మార్పిడి కోసం రెడీ చేసిన 4 ధరఖాస్తులని స్వాధీనం చేసుకున్నామని.. 26వ తేదీన చిన్నా అనే పేద మహిళకు డబ్బు ఆశ చూపి మధ్యవర్తి కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేశారని ఆమె తెలిపారు. ఈ రోజు వచ్చిన రెండో అప్లికేషన్లో రక్తసంబదీకులకు కిడ్ని దానం చేస్తున్నట్లు దరఖాస్తు చేశారని ఆమె పేర్కొన్నారు. విచారణలో ఫేక్ అని తేలడంతో విచారిస్తున్నామన్నారు.