Kidnapped boy in Tirupati Found: బాలుడి అదృశ్యం కేసులో ట్విస్ట్.. సొంత బాబాయే కిడ్నాపర్.. - Kidnapped boy Found in Tirupati
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 1:09 PM IST
Kidnapped boy in Tirupati Found: తిరుపతిలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. ఏర్పేడు మండలం మాధవమాలలో బాలుడిని పోలీసులు గుర్తించారు. బాలుడి బాబాయే కిడ్నాప్ చేసి బంధువు ఇంట్లోనే వదిలివెళ్లాడు. ప్రసార మాధ్యమాల్లో కిడ్నాప్ గురించి రావడంతో.. బంధువులు ఏర్పేడు పోలీసులకు అప్పగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురియ్యాడు. ఆర్టీసీ బస్టాండులోని రిజర్వేషన్ కౌంటర్ వద్ద రాత్రి రెండున్నర గంటల సమయంలో బాలుడ్ని దుండగులు అపహరించారు.
తమిళనాడుకు చెందిన బాలుడి కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనానంతరం స్వస్థలానికి తిరుగు ప్రయాణంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి బస్టాండ్‌కు చేరుకున్నారు. బస్సులు లేకపోవడంతో రిజర్వేషన్ కౌంటర్ వద్ద బస చేశారు. అందరూ నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి కుటుంబ సభ్యులు లేచి చూడగా రెండేళ్ల కుమారుడు కనిపించలేదు. దీంతో వెంటనే తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో బాలుడు ఆచూకీ లభించింది.