నంద్యాలలో క్రషర్ యజమాని కుమారుడు, మనమడు కిడ్నాప్.. రూ. 4 కోట్లు ఇచ్చినా - Banaganapalle kidnap gang arrested
Banaganapalle kidnap gang arrest: నంద్యాల జిల్లాలో జరిగిన ఓ కిడ్నాప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బనగానపల్లెకు చెందిన క్రషర్ యజమాని నాగిరెడ్డి కుమారుడు వినాయక రెడ్డి, మనమడు భరత్ కుమార్ రెడ్డి, డ్రైవర్ సాయినాథ్ రెడ్డిలు కిడ్నాప్ అయ్యారు. కిడ్నాపర్ల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. 11 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయల నగదు.. నాలుగు కార్లు, ఓ కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు. మరి కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. బేతంచర్ల వద్ద ముగ్గురిని కిడ్నాప్ చేసిన.. కర్ణాటక, అనంతపురానికి చెందిన నిందితులు 4 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారని ఎస్పీ రఘువీర్‌రెడ్డి తెలిపారు. వారు అడిగిన మొత్తాన్ని రెండు విడతలుగా చెల్లించినా.. ముగ్గురిని విడిచిపెట్టకపోవడంతో క్రషర్ యజమాని నాగిరెడ్డి పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. కిడ్నాపర్లలో ప్రధాన సూత్రధారి గతంలో బాధితుల వద్ద పని చేశారని ఎస్పీ వివరించారు. ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు వివరించారు.