Kavali RTC Driver Attack Case : ఆర్టీసీ డ్రైవర్లపై దాడి కేసులో ఏడుగురికి రిమాండ్.. నిందితులతో డ్రైవర్ల ప్రాణాలకు ముప్పు : ఈయూ లేఖ - Kavali RTC Driver Attack Accused Appear in Court
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 7:33 PM IST
Kavali RTC Driver Attack Case Accused Appear in Court: నెల్లూరు జిల్లా కావలి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన నిందితులను.. పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మొత్తం ఏడుగురు నిందితులకు నవంబరు 10 వరకు కావలి కోర్టు రిమాండ్ విధించింది. అయితే, ఈ నెల 26వ తేదీన కావలిలో సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్‌పై 14మంది దాడి చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఎంప్లాయిస్ యూనియన్ డీజీపీకి లేఖ రాసింది. డ్రైవర్‌పై దాడి కేసును విజయవాడ కోర్టుకు బదిలీ చేయాలని లేఖలో కోరింది. కావలిలో విచారణ జరిగితే నిందితుల వల్ల డ్రైవర్ల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. నిందితుల అరెస్టు చేయడంలో జరిగిన జాప్యం అనుమానాలకు తావిస్తోందని ఈయూ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగులపై దాడి చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో బోర్డులు పెట్టాలని కోరారు.
డ్రైవర్ రాంసింగ్‌పై దాడిని ఖండిస్తున్నట్లు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు వెల్లడించారు. అసలు నిందితులను కూడా అరెస్టు చేయాలని ఆయన కోరారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నిందితులపై కేసులు పెట్టాలని అన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.