ఆరు నెలల్లో కాపు రామచంద్రారెడ్డిని ఊచలు లెక్క పెట్టిస్తా: కాలవ - టీడీపీ లీడర్ కాలవ శ్రీనివాసులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 26, 2023, 9:39 PM IST
Kalava Srinivasu Allegations Against Kapu Ramachandra Reddy: తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని ఊచలు లెక్క పెట్టిస్తానంటూ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన ఆరోపణలపై కాలవ శ్రీనివాసులు స్పందించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే కాపు అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తానని కాలవ పేర్కొన్నారు. ఆర్నెళ్లలో రామచంద్రారెడ్డిని జైలు ఊచలు లెక్క పెట్టిస్తానని కాలవ సవాలు విసిరారు.
నాలుగున్నరేళ్లలో కాపు అవినీతి, అక్రమలను చూసి వైసీపీ అధిష్ఠానమే వణికిపోతోందని కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. వైసీపీకి చెందిన 151 మందిలో ఎమ్మెల్యేలలో ఎవరికీ రానంత అపఖ్యాతి "రామచంద్రారెడ్డి"కి వచ్చిందన్నారు. మళ్లీ కాపు రామచంద్రారెడ్డికి టికెట్ కేటాయిస్తే, తన చేతిలో ఘోరంగా ఒడిపోతాడనే పక్కా సమాచారం వైసీపీ అధిష్ఠానం దగ్గర ఉందన్నారు. అప్పట్లో బళ్లారిలో గుమస్తాగా పని చేసుకుని బతికిన కాపు, ఇప్పుడు అధికార గర్వంతో తనను తూలనాడుతున్నాడని కాలవ మండిపడ్డారు. గత పాలనలో తాను ఏ ఒక్క అవినీతి పని చేయలేదని కాలవ స్పష్టం చేశారు. తాను చేసిన అభివృద్ధి అడుగడుగునా ప్రజలకు కనిపిస్తోందన్నారు. రాయదుర్గానికి ఉపయోపడే ఒక్క మంచి పని చేయలేని అసమర్థుడు కాపు రామచంద్రారెడ్డి అని విమర్శించారు. కనేకల్లు చెరువులో రూ.2 కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలని కాలవ సవాల్ విసిరారు.
తాను 2024లో ఎమ్మెల్యేగా గెలుస్తానని, అదేవిధంగా "కాపు" చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి జైలుకు పంపుతానని కాలవ హెచ్చరించారు. తనకు టికెట్ రాదన్న బెంగతో, "కాపు" మతిస్థిమితం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే "కాపు" వెంట వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది తప్ప మరెవరూ వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. రామచంద్రారెడ్డి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని కాలవ శ్రీనివాసులు హితవు పలికారు. జగన్ కాపు రామచంద్రారెడ్డికే టికెట్ ఇస్తే, అతనిపై తాను 50వేల మెజారిటీతో గెలుస్తానని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.