TDP Leaders Fires on DGP: కలిసేందుకు డీజీపీ అనుమతి ఇవ్వకపోవడం దారుణం: టీడీపీ - TDP Leaders Fires on DGP
TDP Leaders Fires on DGP: కడప జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు, దాడులపై డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని కలిసి వివరించేందుకు వస్తే కనీసం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ నాయకులకు మాత్రమే ఆయన డీజీపీ కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కడపకు విచ్చేసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసేందుకు టీడీపీ రాష్ట్ర నాయకులు పోలీస్ అతిథి గృహానికి వచ్చారు. గంటసేపు అతిథి గృహం వద్దనే ఉన్నా.. కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని టీడీపీ నేత శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహించారు. రాష్ట్రంలో పట్టపగలు నడిరోడ్లపై హత్యలు జరుగుతున్నా కూడా పోలీస్ శాఖ స్పందించకపోవడం దారుణమని.. పైగా తప్పుడు కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. పేదల భూములను అధికార పార్టీ నాయకులు అక్రమిస్తున్నారని ఆరోపించారు. వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో, జిల్లాలో ప్రకృతి సంపదను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.