Kadapa Pedda Dargah Urusu Utsavam 2023: కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలకు సన్నాహాలు.. నవంబర్ 26న గంధం ఊరేగింపు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 4:50 PM IST
|Updated : Oct 25, 2023, 5:26 PM IST
Kadapa Pedda Dargah Urusu Utsavam 2023 : కడప పెద్ద దర్గా ఉర్సు మహోత్సవం నవంబర్ 25 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వెల్లడించారు. ఈ ఉత్సవాలకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీలతోపాటు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను అధికారులు ఆవిష్కరించారు.
నవంబర్ 26వ తేదీ గంధం, 27 ఉర్సు, 28 ముషాయిరా ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఉర్సు ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు రానున్న దృష్ట్యా వారందరికీ కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.