Avinash Mother Health: మెరుగైన వైద్యం కోసం అవినాష్ రెడ్డి తల్లి హైదరాబాద్ తరలింపు - వివేకా హత్య కేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డి
Avinash Mother Health: మెరుగైన వైద్యం కోసం తల్లి శ్రీలక్ష్మిని తీసుకుని... అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఎనిమిది రోజులుగా... కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ శ్రేణులు, నాయకుల దౌర్జన్యాలు, ఆందోళనలతో వేడెక్కిన కర్నూలు గాయత్రి ఎస్టేట్ ప్రాంతం... ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటోంది. ఈనెల 19న అవినాష్ రెడ్డి తన తల్లిని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో... వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలి వచ్చారు. పోలీసులు సైతం ఈ మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకుల వాహనాలు సైతం ఇక్కడే పార్కింగ్ చేయటంతో... ఇక్కడ ఉన్న ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి బంధువులుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు వెయ్యిమందికిపైగా కార్యకర్తలు ఇక్కడే తిష్ఠ వేయటంతో... స్థానికులు అసహనానికి గురయ్యారు. ఉదయం 11 గంటలకు అవినాష్ రెడ్డి తన తల్లిని తీసుకుని వెళ్లిపోవటంతో... కడప, పులివెందుల, జమ్మలమడుగు నుంచి వచ్చిన వైసీపీ శ్రేణులు సైతం వెళ్లిపోయారు. దీంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి అస్వస్థత:వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు భాస్కర్‌రెడ్డికి అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భాస్కర్‌రెడ్డికి రక్తపోటు పెరగడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అలాగే చికిత్సానంతరం భాస్కర్‌రెడ్డిని అధికారులుమళ్లీ జైలుకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.