విజయనగరంలో రోడ్డెక్కిన జూడాలు - వెంటనే స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ - డాక్టర్స్జీతాలడిమాండింగ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 4:16 PM IST
Junior Doctors Protest at Vizianagaram Sarvajana Hospital: విజయనగరం జిల్లాలో స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్వజన ఆసుపత్రి ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఏడు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 36 గంటలు విధులు నిర్వహిస్తుంటామని తమకు ఎటువంటి కనీస సౌకర్యాలు లేవని వాపోయారు.
ఎన్ని సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్యలు వినేవారు లేకపోవడం శోచనీయమన్నారు. ఎఫ్ఎంజి, ఐఎంజి తేడా చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో కష్టపడి చదువుకొని వైద్యం చేస్తున్నాం. కావున తమకు న్యాయంగా స్టైఫండ్ చెల్లించాలని అడుగుతున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లో సకాలంలో ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకే జీతాలు ఇవ్వని ప్రభుత్వం తమ ప్రాణాలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. తమకు జీతాలు అందే వరకు విధుల్లోకి వెళ్లమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.