JC Prabhakar Reddy: కంటతడిపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎందుకో తెలుసా? - lokesh news
JC Prabhakar Reddy tears on Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 70వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి లోకేశ్ పాదయాత్రపై మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీమంతుడైన నారా లోకేశ్ తన కాళ్లకు బొబ్బలు వచ్చినా కూడా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా మండుటెండలో తిరుగుతున్నది ఎవరి కోసమో తెలుసా.. అంటూ ప్రభాకర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.
లోకేశ్ గొప్ప నాయకుడవుతాడు..టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''యువగళం పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్.. నీ అరికాళ్లకు బొబ్బలు వచ్చిన కూడా అలాగే పాదయాత్ర చేస్తున్నావు. నువ్వు చాలా గ్రేట్.. భవిష్యత్తులో మంచి లీడర్ అవుతావు. శ్రీమంతుడైన నారా లోకేశ్ అతని కాళ్లకు వచ్చిన బొబ్బలు కూడా లెక్క చేయకుండా మండుటెండలో తిరుగుతున్నది ఎవరో కోసమో తెలుసా.. ఈ రాష్ట్ర ప్రజల కోసమే. అతని తాత, నాన్న, తల్లి, భార్య, పిల్లలందరూ శ్రీమంతులు. ఆ కుటుంబం నుంచి వచ్చిన వారంతా ఈ రాష్ట్రం బాగుండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని నిరంతరం తపన పడుతుంటారు. లోకేష్ కర్మ జీవి. సున్నితంగా పెరిగిన లోకేశ్ ఈరోజు ఇలా పాదయాత్ర చేస్తున్నారంటే అందుకు ఆయన తల్లికి, భార్యకు చేతులెత్తి దండం పెడుతున్నా.. లోకేశ్ పర్యటించిన ప్రాంతాల్లో కార్యకర్తల్లో, ప్రజల్లో పెను మార్పులు చూస్తున్నాము.'' అని ఆయన కన్నీళ్లు కార్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.