తాడిపత్రికి రావద్దు - నిజాయితీగా పని చేస్తే సస్పెండ్ చేస్తారు: జేసీ ప్రభాకర్ రెడ్డి - తాడిపత్రి లీడర్ జేసి ప్రభాకర్ రెడ్డి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 10:26 PM IST
|Updated : Dec 9, 2023, 10:45 PM IST
JC Prabhakar Reddy allegations on MLA Peddareddy: తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ కుట్రలో భాగంగా, సీఐ హమీద్ ఖాన్ను సస్పెండ్ చేయించారంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే, డీఎస్పీ చేస్తున్న దోపిడీలకు సీఐ అడ్డువస్తున్నాడని, ఈ నేపథ్యంలో కుట్రకు తెర లేపారని జేసీ ఆరోపించారు. తాడిపత్రిలో పరిస్థితులు సరిగా లేవని, ఇక్కడ పనిచేయడానికి ఎస్ఐలు, ఎస్పీలు రావద్దంటూ జేసీ సూచించారు. ఇప్పటికే తాడపత్రి ప్రాంతంలో ఇసుక, మద్యం తదితర రూపాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులపై మరింత భారం పెరుగుతుందన్నారు. తాడపత్రిలో ఎమ్మెల్యే చెప్పినట్లు డీఎస్పీ వింటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, డీఎస్పీ చెప్పినట్టు వినకపోతే వారిని ఇలా సస్పెండ్ చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు కేసు విషయంపై మాట్లాడినందుకే సీఐని సస్పెండ్ చేశారని ఆరోపించారు. సీఐ తాడిపత్రికి వచ్చిన తరువాతే అనేక అక్రమాలను అరికట్టారని తెలిపారు. నిజాయితీగా ఉన్నవారిని తాడిపత్రిలో ఇబ్బదులు పెడుతున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో కలిసి డీఎస్పీ డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపించారు.