JC Prabhakar Reddy: వర్షం వచ్చినా 'తగ్గేదే లే'.. మూడో రోజు జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన - JC Prabhakar Reddy
JC Prabhakar Reddy initiation: అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తాడిపత్రిలో గత రెండు రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్‌రెడ్డి చేపట్టిన దీక్ష మూడో రోజు కొనసాగుతోంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన దీక్షలో పాల్గొన్నారు. పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాతో పాటు, తాడిపత్రిలో మున్సిపల్ కమిషనర్ విధుల నిర్లక్ష్యంపై మున్సిపల్ ఆఫీస్ ఎదుట దీక్షకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదన్న పోలీసులు.. ముందస్తు చర్యల్లో భాగంగా జేసీ ప్రభాకర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ తీరును ఖండిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుటే జేసీ ప్రభాకర్‌రెడ్డి బస చేశారు. దీనికి కొనసాగింపుగా అక్కడే స్నానం చేసి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం కార్యాలయం ఎదుట టెంట్ వేసి గత రెండు రోజుల నుంచి మున్సిపల్ కార్యాలయం ఎదుట.. మహిళా కౌన్సిలర్లతో కలిసి నిరసన కొనసాగిస్తున్నారు. పురపాలికలో అక్రమాలు జరుగుతున్నా.. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి అభివృద్ధిని కమిషనర్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం కౌన్సిలర్లకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.