ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సి నిధులను కేంద్రం అందుకే ఆపేసింది: జాస్తి వీరాంజనేయులు - ఏపీకి 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసిన కేంద్రం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 8:26 PM IST
Jasti Veeranjaneyulu on Panchayat Funds to AP: ఏపీ ప్రభుత్వం కేంద్రం పంపించిన నిధులను విద్యుత్తు బకాయిలు కింద తీసుకున్నందుని, అందుకే ప్రస్తుతం నిధులను కేంద్రం ఆపేసిందని ఏపీ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన 2 వేల 988 కోట్లు త్వరలో విడుదల చేస్తామని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ హామీ ఇచ్చినట్లు జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు, గ్రామ పంచాయతీలకు 2023, 2024 సంవత్సరాలకు గాను 15వ ఆర్ధిక సంఘం నిధులు 2 వేల 988 కోట్లు రావాల్సి ఉంది.
నిధుల విడుదలపై ప్రధానమంత్రి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వటంతో పాటు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్‌ను కలిసినట్లు వీరాంజనేయులు తెలిపారు. గతంలో ఏపీ ప్రభుత్వం కేంద్రం పంపించిన నిధులను విద్యుత్తు బకాయిలు కింద తీసుకున్నందునే ప్రస్తుతం నిధులను ఆపినట్లు చంద్రశేఖర్ చెప్పారన్నారు. ఇకమీదట విద్యుత్ ఛార్జీల కోసం నిధులను వాడుకోబోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినందున పెండింగ్ నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.