Janasena Corporator Murthy Yadav on MP Vijayasai Reddy: 'కుమార్తె కోసం.. రూ. 100 కోట్ల విలువైన స్థలంలో విజయసాయి రెడ్డి విల్లా' - జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 10:19 PM IST
Murthy Yadav on Vijayasai Reddy: విశాఖ ఐకానిక్ ప్రాజెక్ట్స్ స్థలంలో 100 కోట్ల రూపాయలతో.. విజయసాయిరెడ్డి తన కుమార్తెకు విల్లా కట్టిపెడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను డాక్యుమెంట్లతో సహా మూర్తి యాదవ్ బయటపెట్టారు. భూములను దోచుకోవడం కోసమే.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారని ఆయన మండిపడ్డారు. విజయసాయి రెడ్డి తన కుమార్తె నేహా రెడ్డికి 5076 గజాల్లో అత్యంత విలాసమైన విల్లాన్ని కట్టి పెడుతున్నారని అన్నారు. విజయ్ సాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇంఛార్జిగా వ్యవహరించిన సమయంలో ఈ డీల్ కుదిరిందని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులన్నీ మంజూరు చేసేసి అధికార గణం ఆయనకు తొత్తులా వ్యవహరించిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నా జీవీఎంసీ అధికారులు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉల్లంఘనలపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్ఛార్జ్ హోదాలో ఆయన సంపాదించిన ఆస్తులు, చేసిన వ్యవహారాలపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.