JanaSena వంగవీటి స్మృతివన స్థలంలో వైసీపీ కార్యాలయమా! ఆందోళనకు దిగిన జనసేన - వంగవీటి రంగా
Janasena Leaders Protest: విజయవాడ సితార సెంటర్లో వంగవీటి మోహనరంగా విగ్రహానికి కేటాయించిన స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మాణం తలపెట్టడంపై జనసేన సైనికులు ఆందోళకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వెంటనే వైసీపీ కార్యాలయానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ హెచ్చరించారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. వంగవీటి మోహన రంగా స్మృతి వనం నిర్మస్తామని హామీ ఇచ్చి అక్కడ ఉన్న పేదల గృహాలను ఖాళీ చేయించారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వెంటనే పేదలకు, పశ్చిమ నియోజకవర్గంలోని రంగా అభిమానులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయం కేవలం 10 సెంట్లు స్థలంలో నిర్మించారని కానీ ఎన్టీఆర్ జిల్లాలోని.. పార్టీ కార్యాలయానికి అత్యంత విలువైన రెండు ఎకరాల భూమి ఎందుకని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో విలువైన కార్మిక శాఖకు చెందిన భూమిలో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని.. జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.