ఎంపీకి ఇబ్బందిగా ఉందని రోడ్డును మూసేసిన అధికారులు- ఆందోళన చేస్తున్న జనసేన నేతలను అరెస్టు చేసిన పోలీసులు - latest updates on VIP Tycoon road closure
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 4:34 PM IST
|Updated : Dec 9, 2023, 8:01 PM IST
Jana Sena leaders Concern over VIP road closure in Visakhapatnam: విశాఖ నగరంలోని వీఐపీ రోడ్డు టైకూన్ కూడలి వద్ద ట్రాఫిక్ పేరుతో రోడ్డు మూసి వేయడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆందోళన ఉద్రిక్తపరిస్థితులకు దారి తీయడంతో, పోలీసులు జనసేన నేతలను అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ఒక ఎంపీకి మేలు చేసేందుకు వీఐపీ రోడ్డులోని ఒక కూడలిని మూసివేయడం అన్యాయమంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ రోడ్డులో మూసివేసిన కూడలిని ప్రజల అవసరాల నిమిత్తం వెంటనే తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జనసేన కార్యకర్తలు వీఐపీ రోడ్డులో ఆందోళన చేపట్టారు.
జనసేన నేతల ఆందోళనలకు ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు. జనసేన కార్యకర్తలు మూసివేసిన రహదారిని తెరిచేందుకు వెళుతుండగా, పోలీసులు వారిని అడ్డగించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జనసేన కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు జనసేన నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ రోడ్డును తెరిచే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని జనసేన నేతలు, వీరమహిళలు స్పష్టం చేశారు.