రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం, జనసేన పొత్తు పదేళ్లయినా ఉండాలి: పవన్ కల్యాణ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 8:11 PM IST
Jana Sena chief Pawan Kalyan on JSP TDP alliance:రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం- జనసేన పొత్తు పదేళ్లయినా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ముస్లింలకు విన్నవించారు. ఉత్తరాంధ్రకు చెందిన మైనార్టీ నాయకులు మహ్మద్ సాధిక్, ప్రకాశం జిల్లాకు చెందిన గరికపాటి వెంకట్ పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి పవన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
భారతీయ జనతా పార్టీ వల్ల ముస్లింలకు ఆపద వస్తే అందరికంటే ముందు తానే గొంతెత్తుతానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో ప్రజలకంటే నాయకులే అక్కడి వనరులను ఉపయోగించికొని ఎదిగారని పవన్ ఆరోపించారు. ప్రకాశంలో వలసలు ఆగాలన్నా, తాగునీటి సమస్య పరిష్కారం కావాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, గత తొమ్మిదేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడ్డామని పవన్ పేర్కొన్నారు. ఇంకా పదేళ్లయినా ఇలాగే నిలబడతామని పవన్ వెల్లడించారు.