Jada Sravan on Tidco Houses: 'సీఎం అబద్ధాలు చెబుతున్నారో.. నిజాలు చెబుతున్నారో తెలియట్లేదు' - కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని మల్లాయపాలెం
Jai Bheem Sravan on Tidco Houses: సీఎం హోదాలో ఉన్న జగన్ అధికారుల చేత అబద్ధాలు ఆడిస్తున్నారని.. జై భీం పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో 8912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లు సీఎం జగన్ చెప్పారని తెలిపారు. అసలు సీఎం అబద్ధాలు చెబుతున్నారో, నిజాలు చెబుతున్నారో తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. కృష్ణా జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణంపై టిడ్కో అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం... కృష్ణా జిల్లాలో మెత్తం 11,520 టిడ్కో ఇళ్లు మంజూరు అయ్యాయని, అందులో బేస్‌మెట్, దిగువ స్థాయిలో 1680 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని శ్రవణ్ వెల్లడించారు. రూఫ్ శ్లాబ్ స్థాయిలో 1584 ఇళ్లు, పాక్షికంగా 6576 టిడ్కో ఇళ్లు నిర్మాణంలో ఉండగా.. 1680 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారన్నారు. 1680 ఇళ్లు నిర్మిస్తే 8912 ఇళ్లు నిర్మించినట్లు సీఎం జగన్ ఎలా చెబుతారని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బట్టి టిడ్కో అధికారి ఇచ్చిన సమాచారం తప్పా.. లేక సీఎం చెప్పింది తప్పా.. అనే సందేహాన్ని ఆయన వ్యక్తపరిచాడు. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా అనే విషయాన్ని ప్రభుత్వం సరిచూసుకోవాలని సూచించారు.