MLA Sri Ranganatha Raju: హామీలు నెరవేర్చరా..? గ్రామస్థులు నిలదీయడంతో వెళ్లిపోయిన ఎమ్మెల్యే - Sri ranganatha raju
Jagananna Suraksha: జగనన్న సురక్ష కార్యక్రమంలో.. అధికార వైసీపీకి తీవ్రంగా నిరసన సెగ తగులుతోంది. ఇప్పటికే అనేక చోట్ల వైసీపీ నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెంలో మాజీ మంత్రి శ్రీరంగనాథరాజుకు నిరసన సెగ తగిలింది. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం రామన్నపాలెం వెళ్లారు. 2019లో ఎన్నికల తర్వాత విజయోత్సవ ర్యాలీ భాగంగా అనేక హామీలు ఇచ్చారని.. నేటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మహిళలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎందుకు నిలిపేశారని నిలదీశారు. కోర్టులో కేసులు వేశారని వాటిని ఉపసంహరించుకుంటే పట్టాలు పంపిణీ చేస్తామని సమాధానం ఇచ్చిన రంగనాథరాజు.. ఒక దశలో తాను ఎలాంటి వాగ్దానాలు చేయలేదని స్థానికులతో వాగ్వాదానికి దిగారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు కదా అని ప్రశ్నంచగా.. "ఎవరు తీసుకున్నారు దత్తత" అని దాటవేశారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలు పేపర్ కటింగ్ చూపించమంటారా అని స్థానిక ఎంపీటీసీ సభ్యుడు అనడంతో.. రంగనాథరాజు దురుసుగా మాట్లాడారు. స్థానికులంతా గట్టిగా ప్రశ్నించడంతో.. చేసేదేమీ లేక ఎమ్మెల్యే రంగనాథరాజు అక్కడి నుంచి వెళ్లిపోయారు.