Protest against YSRCP MPP: సమస్యలు పరిష్కరించి అడుగుపెట్టండి.. మోహిత్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు - Jagannana Suraksha programme updates
Protest against Mohit Reddy in Jagananna Suraksha programme: వైఎస్సార్సీపీ ప్రభుత్వం జులై 1వ తేదీ నుంచి జగనన్నకు చెబుదాంకు కొనసాగింపుగా 'జగనన్న సురక్ష' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధికార పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు నిరసన సెగలు తప్పటం లేదు. గ్రామాల్లో ఏళ్ల తరబడి ఉన్న డ్రైనేజీ, మంచినీటి, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరిస్తేనే పల్లెల్లో అడుగుపెట్టాలంటూ గ్రామస్థులు కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. దీంతో ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నేతలు అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు. తాజాగా తిరుపతి గ్రామీణం పేరూరులో వైఎస్సార్సీపీ ఎంపీపీ మోహిత్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది.
వైసీపీ ఎంపీపీకి నిరసన సెగ..తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పేరూరు పంచాయతీలో వైసీపీ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రజల నుండి నిరసన సెగ ఎదురైంది. పేరూరు పంచాయతీలో ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొనగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని, పలుమార్లు స్థానిక నాయకుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామ సమస్యను పరిష్కరించిన తర్వాతే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని గ్రామస్థులు పట్టుబట్టారు.
గ్రామస్థులను లాగేసిన పోలీసులు..ఈ క్రమంలో మోహిత్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులను ఎంఆర్‌పల్లి పోలీసులు బలవంతంగా తరిమేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ..తమ గ్రామంలో గత ఎనిమిదేండ్లుగా డైనేజీ సమస్యతో సతమతమవుతున్నామని వాపోయారు. అనేకసార్లు స్థానిక నాయకులకు, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆవేదన చెందారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తే ఎవరికి ప్రయోజనం..? అంటూ నిలదీశారు. గ్రామస్థుల ద్వారా మరోసారి సమస్యను తెలుసుకున్న మోహిత్ రెడ్డి.. డ్రైనేజీ సమస్య గురించి ఎటువంటి హామీ ఇవ్వకుండానే తిరుగు పయనమయ్యారు.