Jagan Instructions to Parents about Education: బోధన, వసతులు సరిగా లేకపోతే యాజమాన్యాన్ని ప్రశ్నించాలి: సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2023, 7:22 PM IST
Jagan Instructions to Parents about Education:కళాశాలల్లో వసతులు, బోధన సరిగా లేకుంటే యాజమాన్యాన్ని ప్రశ్నించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తే 1902కు ఫిర్యాదు చేయాలని సూచించారు. చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం.. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ విద్యా దీవెన నిధులను విడుదల చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ విద్యార్థులకు మంచి చేస్తున్నట్లు వివరించారు. బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే నేరుగా జమ చేసినట్లు ప్రకటించారు. విద్యా దీవెన పథకం (Jagananna Vidya Deevena) ద్వారా విద్యార్థులకు మంచి చేస్తున్నట్లు వెల్లడించారు. 17 నుంచి 21 సంవత్సరాల విద్యార్థులు మరో 80 సంవత్సరాల వరకు ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు విద్య తోడ్పడుతుందని అన్నారు. వారి జీవన ప్రమాణాలు విద్య ద్వారా మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పిల్లల చదువుల కోసం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు.