Jada Sravan Kumar Fires on CM Jagan: 'ముసిముసి నవ్వులతో లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర జగన్ కుటుంబానిది' - Jada Sravan Kumar
Jada Sravan Kumar Fires on CM Jagan: స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థలనూ జగన్ మేనేజ్ చేస్తున్నారని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. జగన్‌ను నమ్మి సహకరించిన ఐఏఎస్‌లు జైలు పాలయ్యారని.. భవిష్యత్తులోనూ పలువురు ఐఏఎస్‌లు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. న్యాయవ్యవస్థలోని వ్యక్తుల్ని లోబరుచుకోవాలని చేస్తున్న దాడులు.. మొత్తం వ్యవస్థని దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ముసిముసి నవ్వులు, దొంగ మాటలతో.. లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర జగన్ కుటుంబానికే దక్కిందని చురకలు అంటించారు. ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేజషన్లు ఎత్తివేయడం దారుణమన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు జగన్ ఎవరంటూ నిలదీశారు. జగన్‌కు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. వైద్య సీట్లలో రిజర్వేషన్ తొలగించడంపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఆర్-5 జోన్‌లో ఇచ్చిన పట్టాలు చెల్లవని జగన్‌కు తెలుసని అన్నారు. ఆర్ 5 జోన్ పేరుతో.. 47 వేల మందికి ఆశపెట్టిన ప్రభుత్వం పేదలకు 3 సెంట్ల స్థలం, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టించి తీరాలని డిమాండ్ చేశారు. పేదవాడికి 3 సెంట్లు, డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అన్ని రాజకీయపార్టీలతో కలిసి శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.