Jada Shravan Padayatra: ఆంక్షల పేరుతో పాదయాత్ర అణచివేతకు పోలీసుల యత్నం: జడ శ్రావణ్ - కేంద్రానికి లేఖ
Jaibheem Bharat Party President Jada Shravan Kumar: అమరావతి ప్రాంతంలో ఈ నెల 8న తాను తలపెట్టిన పాదయాత్రపై పోలీసుల తీవ్ర ఆంక్షలు విధించటం అన్యాయమని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులను హైకోర్టు ఇస్తే.. పోలీసులు తీవ్రమైన ఆంక్షలు పెడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో మీడియాతో మాట్లాడొద్దని, ఎటువంటి వాహనాలు వాడరాదని తుళ్లూరు పోలీసులు ఉత్తర్వులు జారీ చేయటం హక్కులకు భంగం కలిగించటమేనని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిపై ఆర్థిక, సామాజిక దాడి చేశారని ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాది వరకూ ఎలాంటి ప్రకటన చేయకుండా హఠాత్తుగా మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారని శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ఆ బిల్లు చట్టంలో ఎక్కడా నిలబడదని తెలిసీ రైతులపై కక్ష సాధించేందుకు చట్టం తెచ్చారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి భూములిచ్చారని రైతులను ప్రభుత్వం వేధిస్తోందని, 28 వేల ఎకరాల భూమి సన్నకారు రైతులు ఇచ్చిందేనని తెలిపారు. 25-50-100 ఎకరాలు ఇచ్చిన రైతులు 5 శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు. అమరావతి కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అడగకుండా పూర్తిగా సీఎం సరెండర్ అయ్యారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం వచ్చాక అమరావతికి నిధులు కోరుతూ కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదన్నారు. పాదయాత్ర చేయటం వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉన్న పేటెంటా అని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే పాదయాత్రను చేపడతామని స్పష్టం చేశారు.